Tamil Nadu: అధికారిణి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన దేవాదాయ శాఖ అధికారి అరెస్ట్
- సెల్‌ఫోన్లు, పెన్ కెమెరాలతో చిత్రీకరణ
- గదిలో పురుషుల దుస్తులు ఉండడంతో అనుమానం
- వీడియోలు చూసి నిర్ఘాంతపోయిన అధికారిణి
మహిళా అధికారి స్నానం చేస్తుండగా చిత్రీకరించిన దేవాదాయ శాఖ అధికారికి పోలీసులు అరదండాలు వేశారు. తమిళనాడులోని మధురైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. చదురగిరి సుందరమహాలింగ ఆలయ హుండీ లెక్కింపు కోసం గతవారం మహిళా అధికారి ఒకరు ఆలయానికి వచ్చారు. వీఐపీలు ఉండే వసతి గృహంలో బసచేశారు. కానుకల లెక్కింపు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి వసతి గృహంలోనే ఉన్నారు.
ఉదయం స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత చూస్తే గదిలో పురుషుల వస్త్రాలు వేలాడుతూ కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన ఆమె వాటిని పరిశీలించగా అందులో రెండు సెల్‌ఫోన్‌లు ఉన్నాయి. వాటి కెమెరాలు ఆన్ చేసి ఉండడంతో ఆమె అనుమానం మరింత బలపడింది. షాక్‌కు గురైన ఆమె వెంటనే బాత్‌రూములోకి వెళ్లి అక్కడ ఉన్న దుస్తులను పరిశీలించారు. వాటిలో ఉన్న పెన్ కెమెరాలు ఆన్ చేసి ఉండడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే వాటిని తీసుకున్నారు.
ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయిన ఆమె ఇంట్లోని తన ల్యాప్‌టాప్‌లో ఆ కెమెరాల్లోని మెమొరీ కార్డు వేసి చూశారు. అందులో తనతోపాటు మరో మహిళ స్నానం చేస్తున్న వీడియోలు ఉండడంతో షాకయ్యారు. వెంటనే చెన్నైలోని హిందూ దేవాదాయ శాఖ అధికారికి, మధురై డీఐజీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో హిందూ దేవాదాయ శాఖ జోనల్ జాయింట్ కమిషనర్ పచ్చయప్పన్ ఈ పనికి పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.