Kadapa District: సీఎంగా తొలిసారి... సొంతూరికి జగన్!
- రేపు దివంగత వైఎస్ జయంతి
- ఇడుపులపాయలో జగన్ నివాళులు
- ఆపై జమ్మలమడుగులో బహిరంగ సభ
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేపు వైఎస్ జగన్ కడప జిల్లాలోని పులివెందుల సహా పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందగా, పార్టీ నేతలు వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ కొండారెడ్డి తదితరులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లనున్న జగన్, అక్కడ నివాళుల అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం, పులివెందులలో డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీకి అనుబంధంగా అరటి రీసెర్చ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు.
ఆపై జమ్మలమడుగులో జరిగే సభలో రైతులకు మద్దతు ధర, వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాలను ప్రారంభిస్తారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా క్వింటాల్ శనగలకు రూ. 6,500, వైఎస్సార్ పెన్షన్ రూ. 2250లు లబ్దిదారులకు జగన్ అందిస్తారని అవినాశ్ రెడ్డి తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెరిగిన పెన్షన్లను అందిస్తారన్నారు.
కాగా, జమ్మలమడుగు సభా ప్రాంగణాన్ని కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతితో పాటు పలువురు అధికారులు పరిశీలించారు. రూట్ మ్యాపు, హెలిప్యాడ్ ల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది వచ్చే అవకాశముందో అంచనా వేసి, సభావేదిక నిర్వహణ, గ్యాలరీ, సెక్యూరిటీ తదితరాలపై వైసీపీ నేతలతో చర్చించారు.