AAdhar card: ఇక ఆధార్ నంబరే పాన్ నంబరు.. బడ్జెట్‌లో ఊరట!
- పాన్ లేదన్న చింత ఇక అనవసరం
- పాన్ నంబరు కావాల్సిన చోట ఆధార్ నంబరుతో సరి
- ఆధార్ ఉంటే పాన్‌కార్డు తీసుకోవడం మరింత సులభం
పాన్ కార్డు లేదని చింతిస్తున్న వారికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. పాన్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని, దాని స్థానంలో ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభలో 2019-20 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను దాఖలుకు పాన్ నంబరే ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇకపై ఆధార్ నంబరును ఉపయోగించి కూడా దాఖలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్ నంబరును ఉపయోగిస్తే సరిపోతుందని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి వివరించారు. దేశంలో 120 కోట్ల మంది వద్ద పాన్ కార్డులు ఉన్నట్టు తెలిపారు.
కొత్తగా పాన్‌కార్డు తీసుకునే వారి కోసం కూడా బడ్జెట్‌లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇకపై ఆధార్ కార్డు ఉన్నవారు సులభంగా పాన్‌కార్డును పొందేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. అలాగే, నిర్దేశించిన ఆర్థిక లావాదేవీలకు పాన్, లేదంటే ఆధార్ నంబరును తప్పనిసరి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.