Maharashtra: తివారీ డ్యామ్ కు గండి పడటానికి కారణం పీతలేనట!
- మహారాష్ట్రలోని తివారీ డ్యామ్ కు గండి
- తుడిచిపెట్టుకుపోయిన 12 నివాసాలు
- ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభ్యం
భారీవర్షాలకు మహారాష్ట్రలోని తివారీ ఆనకట్టకు గండి పడిన సంగతి తెలిసిందే. డ్యాంలోని నీరు కింద వైపు ఉన్న ప్రాంతాన్ని ముంచేసింది. డ్యామ్ కింద వైపు ఉన్న 12 నివాసాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘటనలో 23 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఆనకట్టకు గండిపడటంపై మహారాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి తానాజీ సావంత్ ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. డ్యామ్ చుట్టూ పెద్ద సంఖ్యలో పీతలు ఉన్నాయని... వాటివల్లే ఆనకట్టకు లీకేజీ ఏర్పడిందని చెప్పారు. ఇంతకు ముందు లీకేజీలు లేవని... డ్యామ్ చుట్టూ పీతలు చేరిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చారని... అధికారులు కూడా దీనికి సంబంధించిన పనులు చేపట్టారని... అయినా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.