World Cup: బంగ్లాదేశ్ పై 500 పరుగులు చేస్తాం: పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గొప్పలు
- పాక్ గెలవాలంటే బంగ్లాపై 316 పరుగుల తేడాతో గెలవాలి
- టాస్ ఓడినా పాక్ కథ కంచికే
- గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తామన్న సర్ఫరాజ్
ప్రపంచకప్ లో సెమీస్ కు చేరడానికి పాకిస్థాన్ కు దాదాపు అన్ని దారులు మూసుకుపోయాయి. అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్ కు చేరలేదు. అయితే, పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం సెమీస్ కచ్చితంగా చేరుతామనే దీమాతో ఉన్నాడు. బాంగ్లాదేశ్ తో జరగనున్న చిట్టచివరి మ్యాచ్ లో 500 పరుగులు సాధించేందుకు యత్నిస్తామని చెప్పాడు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి... సెమీస్ బర్త్ సాధించాలంటే బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో 450కి పైగా పరుగులు సాధించాలి. అంతేకాదు, బంగ్లాను 316 పరుగుల తేడాతో ఓడించాలి. ఆసక్తిర విషయం ఏమిటంటే... ఈ మ్యాచ్ లో టాస్ కూడా అత్యంత కీలకం కాబోతోంది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ తీసుకుంటే... పాకిస్థాన్ కథ ముగిసినట్టే. 316 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలవాలంటే... బంగ్లాదేశ్ ఎన్ని పరుగులు చేయాల్సి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు వన్డేల్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు 481 పరుగులు మాత్రమే.
వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన సర్ఫరాజ్... 500 పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తామని, బంగ్లాదేశ్ ను 50 పరుగులకే ఆలౌట్ చేసేందుకు కృషి చేస్తామని చెప్పాడు. సెమీస్ కు చేరాలంటే బంగ్లాపై 316 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుందని... గెలిచేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని తెలిపాడు.