Aadhar card: ఆధార్ చట్ట సవరణకు లోక్‌సభ ఆమోదం.. ఇక గుర్తింపు కార్డుగా ఆధార్‌కార్డు
- ప్రతిపక్షాల అభ్యంతరాల నడుమ బిల్లుకు ఆమోద ముద్ర
- బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు గుర్తింపు కార్డుగా ఉపయోగించుకునే వెసులుబాటు
- ఆర్డినెన్స్‌లనే చట్టాలుగా మార్చేస్తున్నారంటూ ప్రతిపక్షాల మండిపాటు
ఆధార్ చట్ట సవరణ బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ప్రతిపక్షాల అభ్యంతరాల నడుమే ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తాజా సవరణతో ఇకపై ఆధార్‌కార్డును గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం దక్కింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు తీసుకునేందుకు ఇకపై ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చు. అయితే, ఈ విషయంలో ఆధార్ కార్డు కోసం ఆయా సంస్థలు వినియోగదారులపై ఒత్తిడి చేయడానికి వీలు లేదు.
ఆధార్ చట్ట సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ నేత రంజన్ చౌధురీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చట్టాల కోసం ఆర్డినెన్స్‌లను ఎంచుకుంటే ఇప్పటి ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఆధార్ చట్టాన్ని తామే తీసుకొచ్చామని అన్నారు. దీనికి న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ బదులిస్తూ.. యూపీయే ప్రభుత్వం ఆధార్ చట్టాన్ని తీసుకొస్తే తాము దానికి చట్టబద్ధత కల్పించామని పేర్కొన్నారు. ఆధార్ చట్ట సవరణలో పారదర్శకత లోపించిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.