Jagan: గ్రామ సచివాలయ ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా భర్తీ: సీఎం జగన్
- ఇవి ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం యువతకు తెలియజేయాలి
- జూలై 15 నాటికి నోటిఫికేషన్ జారీ
- ప్రతి 2000 మంది జనాభాకు ఓ గ్రామ సచివాలయం
వినూత్న తరహాలో ప్రతి గ్రామ పంచాయతీలో ఓ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశం కాగా, దాన్ని అమలు చేసే క్రమంలో సీఎం జగన్ విధివిధానాలు తెలియజేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
నియామకాల్లో పారదర్శకత కోసమే డీఎస్సీ ద్వారా గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని జగన్ తెలిపారు. ప్రతి 2000 మంది జనాభాకు ఓ గ్రామ సచివాలయం ఉండే విధంగా తమ సర్కారు చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. జూలై 15 కల్లా గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసి, ఆపై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలిసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.