Nama Nageswara Rao: రాష్ట్ర సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించి గందరగోళం సృష్టిస్తున్నారు.. స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు టీఆర్ఎస్ ఫిర్యాదు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-2afb97351d34a44ed102c63f2bea46ecc765b3c0.jpg)
- ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తున్నారు
- రాష్ట్ర అంశాలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలున్నాయి
- రాష్ట్రాల సంబంధిత అంశాలను రికార్డుల నుంచి తొలగించండి
రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లోక్‌సభలో లేవనెత్తడంపై టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నేడు లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాష్ట్ర అంశాలతో కొందరు ఎంపీలు లోక్‌సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యతో పాటు అటవీశాఖ అధికారులపై దాడుల అంశాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం లోక్‌సభలో ప్రస్తావించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, తెలంగాణలో ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలపై మాట్లాడారు. అయితే వీరు ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఇతర ఎంపీలు స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించేందుకు అసెంబ్లీలు ఉన్నాయని, కాబట్టి ఆ ఎంపీలు లేవనెత్తిన రాష్ట్రాల సంబంధిత అంశాలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.