Panneer Selvam: అమ్మ మృతి మిస్టరీలా ఉందని నేనెప్పుడో చెప్పా: పన్నీర్ సెల్వం
- ఆసుపత్రిలో ఉండగా ఒక్కసారి కూడా చూడలేదు
- ఆర్ముగస్వామి కమిషన్ నాలుగు సార్లు పిలిచింది
- ముఖ్యమైన పనులుండటంతో వెళ్లలేదు
అమ్మ మృతి మిస్టరీలా ఉందని తానెప్పుడో చెప్పానంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. నేడు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై స్పందించారు. 2016 డిసెంబర్ 5న జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ పలువురు కమిషన్ వేయాలని కోరడంతో 2017 సెప్టెంబర్‌లో ఆర్ముగస్వామి కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.
అయితే ఈ కమిషన్ అప్పట్లో పన్నీర్ సెల్వంను విచారణకు పిలిచినప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఈ విషయాలన్నింటిపైనా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, అమ్మ మృతి మిస్టరీలా ఉందని తానెప్పుడో చెప్పానని, దీనిపై విచారణ చేపట్టాలని సైతం కోరానన్నారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తాను ఒక్కసారి కూడా వెళ్లి చూడలేదన్నారు. అమ్మ మృతిపై విచారణకు వేసిన ఆర్ముగస్వామి కమిషన్ తనను నాలుగు సార్లు పిలిచిందని అయితే ముఖ్యమైన పనులుండటంతో వెళ్లలేదన్నారు. ఈ సారి తనను పిలిస్తే కచ్చితంగా వెళతానని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు.