KCR: దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి పనికిరాని భూములు అంటగట్టారు: కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్
- దళితుడ్ని సీఎం చేస్తామన్నారు
- కేసీఆర్ మోసం చేశారు
- అంబేద్కర్ విగ్రహ నిర్మాణం శంకుస్థాపనతోనే సరిపెట్టారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దళితులను అవమానానికి గురిచేశారంటూ మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి, ఎందుకూ పనికిరాని భూములు పంపిణీ చేశారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ సాకారమైతే దళితుడ్నే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, తద్వారా దళితులను వంచించారని లక్ష్మణ్ మండిపడ్డారు. సబ్ ప్లాన్ నిధులన్నీ దారిమళ్లిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలను బీజేపీ సమర్థంగా తిప్పికొడుతుందని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో లక్ష్మణ్ ప్రసంగించారు. అంబేద్కర్ భవనాన్ని కళ్లుచెదిరే రీతిలో నిర్మిస్తామని, దేశంలో మరెక్కడా లేని రీతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు, ఇప్పటికీ ఆ పనిచేయలేదని విమర్శించారు. విగ్రహ నిర్మాణం కేవలం శంకుస్థాపనతోనే సరిపెట్టారని ఆరోపించారు.