Moham Babu: 'ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మోహన్ బాబు'... అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు: మోహన్‌బాబు పి.ఆర్ టీమ్
- సోషల్ మీడియా ప్రచారంలో నిజంలేదన్న బీఏ రాజు
- మోహన్ బాబు పీఆర్ టీమ్ తరఫున ట్వీట్
- కొన్నిరోజుల కిందట కూడా ఇదే తరహాలో ప్రచారం
ప్రముఖ నటుడు మోహన్ బాబును ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు స్పష్టం చేశారు. ఈ మేరకు మోహన్ బాబు పీఆర్ టీమ్ తరఫున బీఏ రాజు ట్వీట్ చేశారు. ఏపీఎఫ్ డీసీ చైర్మన్ గా మోహన్ బాబు నియామకం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని, వాటిని నమ్మవద్దని సూచించారు.
జగన్ సీఎం అయ్యాక మోహన్ బాబుపై ఈ విధమైన వార్తలు తరచుగా వస్తున్నాయి. ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీలో చేరడమే కాదు, ప్రచారంలో కూడా కొడుకు విష్ణుతో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. పైగా జగన్ తో బంధుత్వం కూడా ఉంది. దాంతో, రాష్ట్రంలో జగన్ సర్కారు ఏర్పడ్డాక మోహన్ బాబుకు ఏదో ఒక పదవి తప్పకుండా ఉంటుందని అందరూ భావించారు. మొన్నటికిమొన్న టీటీడీ చైర్మన్ పదవి మోహన్ బాబుకే అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మోహన్ బాబు అంటూ వార్తలు వచ్చాయి.