Andhra Pradesh: విత్తనాలు మహాప్రభో.. అనంతపురం, నెల్లూరులో రైతుల ఆందోళన!

  • అనంతపురంలో అందని వేరుశనగ విత్తనాలు
  • నెల్లూరులో పచ్చిరొట్ట, పిల్లిపెసర విత్తనాల కొరత
  • ఆందోళనకు దిగిన రైతులు.. తమను గొర్రెల్లా చూస్తున్నారని ఆవేదన

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈరోజు రైతులు ఆందోళనకు దిగారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి నెల రోజులు పూర్తియినా తమకు ఇంకా వేరుశనగ విత్తనాలను వ్యవసాయశాఖ అందివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రొద్దం మండలం వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా పెనుకొండ-పావగడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులను శాంతింపజేశారు.

మరోవైపు నెల్లూరు జిల్ల ఆత్మకూరు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వానలు కురిసిన నేపథ్యంలో పచ్చిరొట్ట, పిల్లిపెసర విత్తనాల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో అధికారులు విత్తనాలు ఇవ్వడం ఆపేశారు. దీంతో రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎప్పుడో తెల్లవారుజామున తాము వ్యవసాయ కేంద్రం వద్దకు వచ్చామనీ, ఇంకా తమకు విత్తనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత 7 రోజులుగా వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామనీ, దీంతో పనులు ఆగిపోయాయని చెప్పారు. మండలంలోని అందరు రైతులను ఒకేరోజు పిలవకుండా 2-3 గ్రామ పంచాయతీల రైతులను పిలిస్తే విత్తనాల పంపకం సులభతరం అయ్యేదని తెలిపారు. అధికారులు రైతులను గొర్రెల్లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Anantapur District
Nellore District
agriculture
seeds supply
farmers
agitation
dharna
  • Loading...

More Telugu News