Guntur: ఉద్యోగం కోసం వెళితే... ఐదు నెలలపాటు కోరిక తీర్చుకున్నాడంటూ గుంటూరు డీఎఫ్‌వోపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ!
- ఉద్యోగమిస్తానని రూ. 2 లక్షలు తీసుకున్న మోహన్ రావు
- ఆపై లోబరచుకున్న ప్రభుత్వ అధికారి
- ఇదంతా గిట్టని వారి పనేనంటున్న డీఎఫ్‌వో
ప్రభుత్వ కొలువ ఇప్పిస్తానంటూ, తన వద్ద రూ. 2 లక్షలు తీసుకోవడమే కాకుండా, రోజుల తరబడి తిప్పించుకుని, డబ్బులిస్తే మాత్రమే చాలదంటూ, ఐదు నెలల పాటు కోరిక తీర్చుకుని, ఇప్పుడు ఉద్యోగమిచ్చేది లేదంటున్నాడని గుంటూరు జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్‌వో) కె.మోహన్ రావుపై ఓ మహిళ గుంటూరు పట్టణ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతి, డీ ఫార్మసీ పూర్తి చేసుకుంది. 2009లో వివాహమైన ఆమె, తరువాత భర్తకు దూరమై, విడాకులు తీసుకుని, తన కుమార్తెతో కలిసి తల్లి దగ్గర జీవిస్తోంది.
గుంటూరు అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగాలున్నాయని తెలుసుకున్న ఆమె, ఫిబ్రవరిలో మోహన్ రావును కలిసింది. ఆపై ఆమె సర్టిఫికెట్లు, సెల్ నంబరు తీసుకుని, ఫోన్ చేసి, ఉద్యోగ విషయం మాట్లాడాలని పిలిపించాడని వెల్లడించింది. క్లర్క్ పోస్ట్ ను ఇప్పిస్తానని, తదుపరి పర్మినెంట్ అవుతుందని నమ్మబలికి, అందుకు రూ. 4 లక్షలు ఇవ్వాల్సివుంటుందని అనగా, అంత ఇచ్చుకోలేనని చెప్పిన ఆ యువతి, రూ. 2 లక్షలకు బేరం కుదుర్చుకుని ఆ డబ్బు ఇచ్చానని వెల్లడించింది..
తరువాత కొన్ని రోజులకు ఉద్యోగం గురించి అడుగగా, కేవలం డబ్బులిస్తే చాలదని, తన కోరిక తీర్చాలని చెప్పి లొంగదీసుకున్నాడని, ఆపై ఆదివారాలు, సెలవు రోజుల్లో తన కార్యాలయానికి పిలిపించుకొని తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఆపై ఉద్యోగం గురించి అడుగగా, లేదన్నాడని, ఈ విషయమై అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది.
కాగా, తనపై ఆరోపణలు చేస్తున్న యువతి ఎవరో తనకు తెలియదని మోహన్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, తానంటే గిట్టని అటవీ శాఖ ఉద్యోగులు కొందరు ఈ ఫిర్యాదు చేయడం వెనుక ఉన్నారని, పోలీసులు విచారిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.