India: క్రికెట్ వరల్డ్ కప్ సెమీస్... రెండే ఆప్షన్స్!
- ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, ఇండియా- ఇంగ్లండ్
- రెండో ఆప్షన్ ఇండియా-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-ఇంగ్లండ్
- సౌతాఫ్రికాతో ఆసీస్ పోరుపై ఆధారపడ్డ మ్యాచ్ లు
ఈ సీజన్ వరల్డ్ కప్ సెమీఫైనల్ పోటీల్లో ఎవరెవరు పోటీ పడనున్నారో 99 శాతం ఖరారైపోయింది. అద్భుతం జరిగితే తప్ప అది మారదు. ఒక సెమీస్ ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ మధ్య, రెండో సెమీస్ ఇండియా- ఇంగ్లండ్ మధ్య జరిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తొలి స్థానంలో ఆసీస్, రెండో స్థానంలో ఇండియా ఉండగా, శ్రీలంకపై జరిగే పోరులో ఇండియా ఓడినా సెమీస్ పోరులో జట్లు మారబోవు. ఒకవేళ ఇండియా శ్రీలంకను ఓడించి, దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓడితే మాత్రం స్థానాల్లో మార్పు వస్తుంది. అప్పుడు ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఒక సెమీస్, ఆసీస్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ జరుగుతాయి.
ఇప్పుడున్న బలాబలాలను పరిశీలిస్తే, దక్షిణాఫ్రికా జట్టు అత్యంత బలంగా కనిపిస్తున్న ఆసీస్ ను ఓడించడం దాదాపు అసాధ్యమే. ఒకవేళ అదే జరిగి, శ్రీలంకపై ఇండియా గెలిస్తే ఆసీస్ రెండో స్థానానికి పడిపోతుంది. ఇక తన చివరి మ్యాచ్ లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 316 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించడం అసంభవం. కాబట్టి ఆ జట్టు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించినట్టే. కాబట్టి సెమీస్ పోరు ఆది నుంచి ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్నాయి. ఎటొచ్చీ ఎవరితో ఎవరికి పోటీ అన్నది మాత్రమే తేలాల్సివుంది.