Maharashtra: మహారాష్ట్రలో ఆనకట్టకు గండి ఘటనలో 14 మంది మృతి.. ఇంకా లభించని 9 మంది ఆచూకీ
- ఏడు గ్రామాలను ముంచెత్తిన వరదనీరు
- మృతదేహాలను తీసుకునేందుకు బాధిత కుటుంబ సభ్యుల నిరాకరణ
- మంత్రి హామీతో వెనక్కి తగ్గిన గ్రామస్థులు
మహారాష్ట్రలోని తివారీ ఆనకట్టకు గండిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 14కు చేరుకుంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రత్నగిరి జిల్లా తివారీ గ్రామంలో ఉన్న డ్యాంకు మంగళవారం రాత్రి గండిపడింది. వరద నీరు ఏడు గ్రామాలను ముంచెత్తింది. ఈ ఘటనలో రత్నగిరికి చెందిన 23 మంది గల్లంతయ్యారు.
వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారం రాత్రి వరకు చేపట్టిన గాలింపులో 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 9 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. పోటెత్తిన వరదనీరు కారణంగా రత్నగిరిలో 9 ఇళ్లు, రెండు బ్రిడ్జీలు ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు.
కాగా, మృతదేహాలను తీసుకునేందుకు బాధిత కుటుంబ సభ్యులు నిరాకరించారు. డ్యాం ప్రమాదకరంగా ఉందంటూ పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. అయితే, అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఆనకట్ట గండిపై విచారణకు ఆదేశిస్తామని మంత్రి గిరీశ్ మహాజన్ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.