Andhra Pradesh: నేటి నుంచి ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ప్రారంభం!
- సభా సంప్రదాయాలు, నిబంధనలు తెలియజేసేలా తరగతులు
- కొత్తగా అసెంబ్లీకి వచ్చిన 100 మంది ఎమ్మెల్యేలు
- తరగతుల ప్రారంభం సందర్భంగా ప్రసంగించనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సభా సంప్రదాయాలు, నియమాలు, హక్కులను తెలియజేసేందుకు నేటి నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నేడు, రేపు ఈ క్లాసులు జరగనున్నాయి. అసెంబ్లీ వ్యవహారాలు, ప్రశ్నోత్తరాలు, బడ్జెట్ నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ తరగతుల్లో అవగాహన కల్పించనున్నారు.
ఈసారి ఏపీ అసెంబ్లీకి ఎన్నికయినవారిలో 100 మంది మొదటిసారి గెలిచినవారే. ఈ నేపథ్యంలో వీరందరికీ తాజా శిక్షణ కారణంగా లబ్ధి చేకూరుతుంది. ఈ శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ శిక్షణలో భాగంగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పీఆర్ఎస్ ప్రతినిధి చక్షూరాయ్, ప్రభుత్వ మాజీ కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, డాక్టర్ జయప్రకాష్ నారాయణ తదితరులు ఈ తరగతుల్లో ప్రసంగిస్తారు.