Bhadradri Kothagudem District: చెలరేగిన పోడుసాగుదారులు.. అటవీ అధికారులపై మరో దాడి!

  • కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • రాత్రివేళ ట్రాక్టర్లతో దుక్కిదున్నిన గ్రామస్థులు 
  • అడ్డుకున్న అధికారులపై గ్రామస్థుల దాడి

అటవీ అధికారులపై పోడుసాగుదారులు మరోమారు రెచ్చిపోయారు. అయితే, ఈసారి కొత్తగూడెం జిల్లాలో. ములకలపల్లి మండలం తిమ్మంపేట బీట్‌లో సోమవారం సెక్షన్ అధికారి నీలమయ్య తన సిబ్బందితో గస్తీ తిరుగుతుండగా ఈ ఘటన జరిగింది. గుండాలపాడు సమీపంలోని అటవీ భూమిలో కొందరు మూడు ట్రాక్టర్లతో దుక్కిదున్నడాన్ని గమనించి అడ్డుకున్నారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పాల్వంచకు తరలిస్తుండగా గమనించిన గ్రామస్థులు కొందరు అటవీ అధికారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.

దాడి చేస్తున్న వారి ఫొటోలు తీసేందుకు అధికారులు ప్రయత్నించడంతో వారి సెల్‌ఫోన్లు లాగేసుకున్నారు. గ్రామస్థుల బారినుంచి తప్పించుకున్న అటవీ అధికారులు ములకలపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన  సెక్షన్‌ అధికారి నీలమయ్య, బీట్‌ అధికారులు భాస్కర్‌, భూక్యా పద్మ, రవి, రాంకోటిలను పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఇటీవల కుమురం భీం జిల్లా కొత్త సార్సాలలో ఫారెస్ట్ రేంజ్ ఆధికారిణి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు తన అనుచరులతో కలసి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం విదితమే.

Bhadradri Kothagudem District
Forest officers
Attack
Telangana
  • Loading...

More Telugu News