V.Hanumantha Rao: ఆంధ్రా వాళ్లు వెళ్లిపోవడంతో సెక్రటేరియట్ తెలంగాణకు పూర్తిగా సరిపోతుంది: వీహెచ్
- నూతన అసెంబ్లీ నిర్మాణం అవసరమా?
- చార్మినార్‌ను కూలగొడితే ఏం చేస్తారు?
- సెక్రటేరియట్‌కు మరో 70 ఏళ్ల పాటు ఢోకా లేదు
ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలును మరచి భవనాలను కూలగొడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న సెక్రటేరియట్ కూల్చివేత, నూతన అసెంబ్లీ నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా వాళ్లు కూడా వెళ్లిపోవడంతో ఇప్పుడున్న సెక్రటేరియట్ తెలంగాణకు పూర్తిగా సరిపోతుందన్నారు.
రెండు రాష్ట్రాలకు సరిపోయే అసెంబ్లీ ఉండగా కొత్త అసెంబ్లీ అవసరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాటికి మద్దతిస్తున్న ఎంఐఎం వాళ్లు చార్మినార్‌ను కూలగొడితే ఏం చేస్తారని వీహెచ్ నిలదీశారు. అలాగే సెక్రటేరియట్‌కు మరో 70 ఏళ్ల పాటు ఢోకా లేదని, అలాంటి భవనాన్ని కూల్చడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.