London: విమానంలోంచి పడిన వ్యక్తి... గార్డెన్ లో సన్ బాత్ చేస్తున్న వ్యక్తికి తప్పిన ప్రమాదం!
- లండన్ లో ఆశ్చర్యకర ఘటన
- గార్డెన్ లో సన్ బాత్ చేస్తున్న వ్యక్తి పక్కనే పడిన అక్రమవలసదారుడు
- అదృష్టవశాత్తు పక్కనే పడడంతో బతికిపోయిన లండన్ వాసి
లండన్ లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. కెన్యా ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం హీత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ముందు అందులోంచి ఓ వ్యక్తి కిందపడ్డాడు. విమానం కిందికి దిగే ప్రయత్నంలో ఉండగా, ఆ వ్యక్తి నగరంలోని జాన్ బాల్డాక్ అనే వ్యక్తి నివాసంలో ఉన్న గార్డెన్ లో పడిపోయాడు. ఆ సమయంలో బాల్డాక్ హాయిగా సన్ బాత్ లో నిమగ్నమై ఉన్నాడు. ఇంతలో దబ్ మన్న శబ్దంతో పక్కనే ఏదో వస్తువు పడినట్టుగా అనిపించడంతో పక్కకు చూసిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.
అక్కడంతా రక్తపు మడుగు, అందులో ఓ వ్యక్తి దేహం పడి ఉంది. ఆ వ్యక్తి పడిన చోట భూమి కుంగిపోవడంతో బాగా ఎత్తు నుంచి పడి ఉంటాడని భావిస్తున్నారు. అదృష్టం ఏంటంటే, విమానం నుంచి పడిపోయిన వ్యక్తి కిందపడ్డాడు కాబట్టి సరిపోయింది, బాల్డాక్ పై పడి ఉంటే ఏంజరిగేదో ఊహించలేమని ఇరుగుపొరుగు వ్యాఖ్యానించారు. కాగా, కెన్యా ఎయిర్ వేస్ విమానం హీత్రూ ఎయిర్ పోర్టులో ల్యాండైన తర్వాత, ల్యాండింగ్ గేర్ విభాగంలో ఓ సంచి, కొంత ఆహారం, మంచినీటి బాటిల్ కనిపించాయి. చనిపోయిన వ్యక్తి అక్రమంగా కెన్యా నుంచి లండన్ వలస వచ్చేందుకు విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్ మెంట్ లోకి చొరబడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.