Andhra Pradesh: ఏపీలో అధికారం వెలగబెడుతోంది వైసీపీనా? టీడీపీనా?: నారా లోకేశ్
- ఏపీలో రైతులు ‘విత్తనాలో జగన్ ప్రభో’ అంటున్నారు
- గత ప్రభుత్వం వల్లే ఆలస్యమైందని చెబుతారా!
- జగన్ కు పాలన చేతకావట్లేదు
ఏపీలో రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
వైకాపా అధికారంలో ఉందని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ‘విత్తనాలో జగన్ ప్రభో’ అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే, గత పాలకుడు చంద్రబాబు వల్లే రైతులకు విత్తనాలు ఇవ్వలేకపోతున్నామని అంటున్నారని విమర్శించారు. ఒకటో తారీకున వచ్చే పింఛన్ రాలేదేమని వృద్ధులు నిలదీస్తుంటే గత ప్రభుత్వం వల్లే ఆలస్యమైందని సమాధానం ఇవ్వడం కరెక్టు కాదని అన్నారు.
‘బీమా రాలేదు.. మా బతుకులకు ధీమా ఏదీ అంటే! తెలుగుదేశం సర్కారు వల్లే’ అంటూ మాట దాటవేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ.. సీఎం అయ్యి, పాలన చేతకాక, ఇప్పుడు చంద్రబాబే వింటాడు, చంద్రబాబే ఉంటాడు’ అని అంటున్నారని, ఏపీలో అధికారం వెలగబెడుతోంది వైసీపీనా? టీడీపీనా? అని ప్రశ్నించారు.