Odisha: ఆదివాసీ హాస్టల్ అమ్మాయిలకు గర్భం... ఒడిశాలో తీవ్ర కలకలం!
- వేసవి సెలవుల నిమిత్తం ఇళ్లకు వెళ్లిన అమ్మాయిలు
- తిరిగి రాగానే వైద్య పరీక్షలు జరిపించిన అధికారులు
- మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్న సీపీ
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఉన్న ఆదివాసీ సంక్షేమాభివృద్ధి విభాగం వసతి గృహంలో నలుగురు చదువుకుంటున్న అమ్మాయిలు గర్భం దాల్చడం తీవ్ర కలకలం రేపుతోంది. అమ్మాయిలకు వైద్య పరీక్షల తరువాత విషయం తేలగా, శిశు సంక్షేమ కమిటీ ప్రతినిధులు భువనేశ్వర్ పోలీసు కమిషనర్ సత్యజిత్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఇటీవలి కాలంలో మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ హాస్టళ్లలోని అమ్మాయిలు గర్భం దాల్చుతున్న ఘటనలు పెరగడంతో, జాతీయ బాలల ఆరోగ్య పథకం (ఎన్‌సీహెచ్‌సీ) ఆధ్వర్యంలో, హాస్టళ్లలో ఉండే అందరు అమ్మాయిలకూ పరీక్షలు నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం తిరిగి వారు హాస్టళ్లకు రాగానే పరీక్షలు చేయగా, ఈ విషయం తేలింది. దీనిపై స్పందించిన సత్యజిత్, ఆరోగ్య పరీక్షల నివేదికను పరిశీలిస్తున్నామని, వారికి మరోసారి ఇవే పరీక్షలు చేసి ఏం చేయాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.