V.Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై 41 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు
- 2016 నుంచి చలాన్లు చెల్లించని శ్రీనివాస్ గౌడ్
- హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ పైనా చలాన్లు
- రూ.11,995 చలాన్లు చెల్లించని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్
తెలంగాణ ఎక్సైజ్ శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. ఆయనపై 41 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్టు తేలింది. వీటి మొత్తం విలువ రూ.46,535. 2016 నుంచి ఆయనపై చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్టు ఈ-చలాన్ వెబ్‌సైట్ చూపిస్తోంది. వీటిలో చాలా వరకు అధికవేగం, ప్రమాదకర డ్రైవింగ్, కారుకు నల్లరంగు అద్దాలు కలిగి ఉండడం, నో పార్కింగ్ జోన్‌లో కారు పార్కింగ్ వంటివి ఉన్నాయి. తాజాగా, మే 21న కూడా ఆయనపై చలాన్ జారీ అయింది.
కాగా, హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ పైనా 6,210 రూపాయల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీకే ఝా ప్రభుత్వ వాహనంపై రూ.11,995 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పరిమితికి మించిన వేగానికి సంబంధించిన చలాన్లు ఉండడం గమనార్హం. 2016 నుంచి ఇవి పెండింగ్‌లో ఉండడం మరో విశేషం.