Hongkong: హెల్మెట్లు ధరించి పార్లమెంటులోకి.. యుద్ధభూమిలా మారిన హాంకాంగ్ పార్లమెంటు!
- నేరస్తుల అప్పగింత బిల్లుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత
- మూడువారాలుగా అట్టుడుకుతున్న హాంకాంగ్
- పార్లమెంటులోకి చొరబడి నానా విధ్వంసం
సోమవారం హాంకాంగ్ పార్లమెంటు రణరంగమైంది. ముసుగులు వేసుకుని, హెల్మెట్లు ధరించి లోపలికి చొచ్చుకొచ్చిన నిరసనకారులు సభలో విధ్వంసం సృష్టించారు. అనుమానిత నేరగాళ్లను చైనాకు అప్పగించే విషయంలో గత మూడు వారాలుగా హాంకాంగ్ అట్టుడుకుతోంది. బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. సోమవారం ఈ ఆందోళన హింసకు దారి తీసింది.
మరోవైపు నేరగాళ్లను చైనాకు అప్పగించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంటులోకి నిరసనకారులు దూసుకెళ్లారు. ముసుగులు, హెల్మెట్లు ధరించి లోపలికి చొరబడిన నిరసనకారులు గోడలకు ఉన్న చిత్రపటాలను విసిరికొట్టారు. గోడలకు రంగులు పూసి నానా విధ్వంసం సృష్టించారు. అద్దాలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.