Basanth Kumar: టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్న బసంత్ కుమార్ వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే!
- 2017లో రూ.16,100తో కూతురి పెళ్లి
- రూ.18 వేలతో కొడుకు పెళ్లి
- ఐఏఎస్ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు
ఏపీ సీఎంగా జగన్ వచ్చాక అనేక వ్యవస్థల్లో అధికారులకు స్థానచలనం కలుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీటీడీ జేఈవోగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న శ్రీనివాసరాజుకు బదిలీ కాగా, ఆయన స్థానంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (వీఎండీఏ) వైస్ చైర్మన్ బసంత్ కుమార్ కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బసంత్ కుమార్ ఐఏఎస్ అధికారుల్లో ఎంతో విలక్షణమైన వ్యక్తి అని చెప్పాలి.
గతంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత బదిలీపై వీఎండీఏ వైస్ చైర్మన్ గా వచ్చారు. ఇప్పుడు టీటీడీలో ప్రవేశించారు. బసంత్ కుమార్ ఎందుకు ప్రత్యేకం అంటే, ఆయన తన పిల్లల వివాహాలను ఎంతో నిరాడంబరంగా, నమ్మశక్యం కాని రీతిలో అతి తక్కువ ఖర్చుతో జరిపించారు.
2017లో కుమార్తె పెళ్లికి కేవలం రూ.16,100 ఖర్చు చేసిన ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.18,000తో కొడుకు వివాహం జరిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తనయుడి పెళ్లిలో బసంత్ కుమార్ రూ.18 వేలు ఖర్చు చేయగా, వధువు తరఫు వారు మరో రూ.18 వేలు ఖర్చు చేశారు. శుభలేఖల్లో సైతం కానుకలు వద్దు, ఆశీస్సులు చాలంటూ తన వైఖరిని సుస్పష్టం చేశారు. మధ్యతరగతి కుటుంబాల వాళ్లు కూడా పెళ్ళిళ్ళ కోసం భారీగా ఖర్చు పెడుతున్న తరుణంలో, అన్నీ ఉన్నా కూడా ఎంతో సింపుల్ గా వివాహాలు జరిపించిన బసంత్ కుమార్ ఐఏఎస్ ను ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పాలి.