Andhra Pradesh: ఆర్టీసీ కష్టాలు సినిమా రేంజ్ లో ఉన్నాయి.. పీఎఫ్ సొమ్మును కూడా వాడేశారు!: మంత్రి పేర్ని నాని
- ఆర్టీసీకి ఇప్పుడు రూ.6500 కోట్ల అప్పులున్నాయి
- ఆర్టీసీని ఆదుకోవాలని ఆర్థిక శాఖకు లేఖ రాస్తాం
- ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరతాం
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి ప్రస్తుతం రూ.6,500 కోట్ల అప్పులు ఉన్నాయని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కార్మికుల పీఎఫ్ సొమ్మును కూడా వాడేసిందని విమర్శించారు. ఆర్టీసీని ఆదుకోవాల్సిందిగా ఏపీ ఆర్థిక శాఖకు లేఖ రాశామని, ఈ విషయంలో స్పష్టమైన ప్రతిపాదనలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను కలుస్తామని అన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ ఆర్థిక కష్టాలు సినిమా రేంజ్ లో ఉన్నాయని వాపోయారు. ప్రస్తుతం రవాణాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిందిగా ఆర్థిక శాఖను కోరతామని మంత్రి పేర్నినాని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే.