World Cup: సస్పెన్స్ గా మారిన వరల్డ్ కప్ సెమీస్ బెర్త్ లు... తాజా సమీకరణాలు ఇవి!
- తుది అంకానికి చేరుకున్న పోటీలు
- ఆసీస్ మాత్రమే ఇంతవరకూ కన్ఫార్మ్ గా సెమీస్ కు
- మూడు స్ధానాల కోసం ఐదు జట్లు పోటీలో
లండన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో లీగ్ దశపోటీలు ముగుస్తాయి. సెమీస్ కు నాలుగు జట్లకు చాన్సుండగా, ఇప్పటివరకూ ఆస్ట్రేలియా మాత్రమే తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. మిగతా మూడు జట్ల కోసం ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోటీలో ఉన్నాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించగా, నిన్న ఇండియాతో పోరులో ఇంగ్లండ్ గెలవడంతో శ్రీలంక సెమీస్ ఆశలు మాయమయ్యాయి.
ఇక తదుపరి జరగాల్సిన మ్యాచ్ లను పరిశీలిస్తే, నేడు శ్రీలంక, వెస్టిండీస్ మధ్య పోటీ జరుగుతుంది. రెండు జట్లూ ఇప్పటికే నిష్క్రమించడంతో పోటీకి పెద్దగా విలువ లేదు. రేపు బంగ్లాదేశ్ తో ఇండియా ఆడుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే 13 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. ఓడిపోయిందనుకున్నా సెమీఫైనల్ రేసులోనే ఉంటుంది.
ఎల్లుండి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే, మరో సమీకరణంతో సంబంధం లేకుండా ఆ జట్టు సెమీస్ కు వెళుతుంది. ఓడిపోతే మాత్రం, బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ ఓడిపోవాలని కోరుకోవడం మినహా ఆ జట్టుకు మరో మార్గం ఉండదు. న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయి, బంగ్లాదేశ్ పై పాక్ గెలిస్తే, ఆ జట్టు సెమీస్ కు వెళుతుంది. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే, ఇండియా, పాకిస్తాన్ లపై భారీ తేడాతో గెలిస్తేనే ఆ జట్టుకు చాన్స్ ఉంటుంది.