Air India: రన్‌వేపై జారిన ఎయిరిండియా విమానం.. 183 మంది ప్రయాణికులు సేఫ్

  • మంగళూరులో ల్యాండైన విమానం
  • ట్యాక్సీవే పైనుంచి కిందికి జారి గడ్డిలో కూరుకుపోయిన వైనం
  • సూరత్‌ విమానాశ్రయంలో మరో ప్రమాదం

ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్ 384 ఆదివారం సాయంత్రం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైంది. ఈ క్రమంలో ట్యాక్సీవే పైనుంచి కిందికి జారి గడ్డిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో విమానంలో 183 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉద్ధృతంగా వీస్తున్న గాలులతోపాటు రన్‌వే తడిగా ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత విమానాశ్రయ సేవలను కాసేపు నిలిపివేశారు.

గడ్డిలో చిక్కుకున్న విమానం నుంచి ప్రయాణికులను సహాయక సిబ్బంది క్షేమంగా కిందికి దింపారు. కాగా, ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 22 మే 2010లో ఇదే విమానాశ్రయంలో అచ్చం ఇలాగే జరిగిన ప్రమాదంలో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. పైలట్ నిద్రమత్తు కారణంగా విమానం రన్‌వే దాటి లోయలో పడిపోయింది. కాగా, తాజా ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

సూరత్‌లో ఆదివారమే జరిగిన మరో ఘటనలో 43 మంది ప్రాణాలతో బయటపడ్డారు. భోపాల్ నుంచి వచ్చి సూరత్‌ విమానాశ్రయంలో ల్యాండైన స్పైస్‌జెట్ విమానం అదుపుతప్పి రన్‌వే పక్కకి జారిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెలుతురు తక్కువగా ఉండడంతో ముందున్న ప్రదేశం పైలట్‌కు కనిపించలేదు. వేయాల్సిన సమయంలో బ్రేక్ వేయకపోవడంతో విమానం అదుపు తప్పి రన్‌వే పక్కకి దూసుకెళ్లింది.

  • Loading...

More Telugu News