Suryapet: సూర్యాపేట పోలీసులను అవాక్కయ్యేలా చేసిన యువతీ యువకుల ప్రేమ కథ!
- ఇంట్లో మాయమవుతున్న నగలు, డబ్బు
- ప్రియుడికి కారు కోసం ప్రియురాలి దొంగతనం
- సెల్ ఫోన్ కాల్స్ పరిశీలనతో వెలుగులోకి
ఇంట్లోని నగలు ఒక్కొక్కటిగా పోతున్నాయి. డబ్బు మాయం అవుతోంది. ఆ ఇంట్లోని వారు తమకు పక్కింటి వారిపైనే అనుమానం ఉందని అంటున్నారు. వారు చెప్పినప్పుడల్లా పోలీసులు ఇరుగు, పొరుగువారిని పిలిపించి ప్రశ్నిస్తున్నారు. కానీ, వారికి ఏమీ ప్రమేయం లేదని తేలుస్తున్నారు. ఆ ఇంట్లో అసలేం జరుగుతుందో తేల్చాలని రంగంలోకి దిగిన పోలీసులు, ఎంతో మంది అనుమానితులు, ఇంటివారి ఫోన్ కాల్స్ బయటకు తీసి, అవాక్కయ్యే ఓ ప్రేమాయణాన్ని వెలుగులోకి తీశారు. తన ప్రియుడి కోసం ఇంటి అమ్మాయే దొంగతనాలకు పాల్పడుతోందని తేల్చారు.
సూర్యాపేటలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పట్టణంలోని ఓ వ్యక్తి ఇంట్లో ఆమె మనవరాలు ఎం ఫార్మసీ చదువుతూ ఉంటోంది. ఇటీవల ఆమెకు యానాంకు చెందిన కర్రి సతీష్ అనే యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కాగా, అతనితో ప్రేమలో పడింది. ప్రియుడు కారు కావాలని చెబితే, తొలుత ఇంట్లోని బీరువాలో ఉంచిన 20 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి ఇచ్చింది. ఆపై పలుమార్లు డబ్బు నగలు దొంగిలించి ఇచ్చింది. అమ్మాయి తాత పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తమ ఇంట్లో అద్దెకు ఉండే మహిళపై అనుమానం వ్యక్తం చేయడంతో, ఆమెను పిలిపించి విచారించి, ఆమె కాదని పోలీసులు నిర్ణయించారు.
మరోవైపు పోలీసుల విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తన ప్రియుడికి ఆమె ఫోన్ లో చెబుతూ ఉండేది. అతను ఆ నగలను తాకట్టుపెట్టి, కారు కొనుగోలు చేసి జల్సాలు చేస్తున్నాడు. పోలీసులు గుర్తిస్తే కనుక కారును మళ్లీ అమ్మేసి, బీరువాలో నగలను తిరిగి పెట్టాలని భావించారు. విచారణలో భాగంగా సూర్యాపేట పోలీసులు కుటుంబ సభ్యులందరి సెల్ ఫోన్ నంబర్లు తీసుకుని, వారు తరచూ మాట్లాడే నంబర్లపై నిఘా పెట్టారు. యజమాని మనవరాలు యానాంకు చెందిన యువకుడితో తరచూ మాట్లాడుతోందని గమనించి ఆ కోణంలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. ప్రేమికుడి జల్సాల కోసమే ఆమె, తన ఇంట్లోని నగలను చోరీ చేసిందని తేల్చారు.