Pakistan: ఆఫ్ఘన్ క్రికెటర్ల ఐడీ కార్డులు తనిఖీ చేస్తే వారి బండారం బయటపడుతుంది: షోయబ్ అక్తర్ తీవ్ర వ్యాఖ్యలు
- ఆఫ్ఘన్లను చూసి నేర్చుకోవాలంటూ పాక్ జట్టుకు స్థనిక్జాయ్ హితవు
- మండిపడిన అక్తర్
- ఆఫ్ఘన్ జట్టులో సగానికిపైగా పెషావర్ కు చెందినవాళ్లేనంటూ ఆరోపణ
ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై పాకిస్థాన్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. అక్తర్ ఆగ్రహానికి కారణం ఉంది. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో షఫీఖ్ స్థనిక్జాయ్ మాట్లాడుతూ, పాక్ జట్టు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లను చూసి నేర్చుకోవాలని కామెంట్ చేశాడు. దాంతో మండిపడిన షోయబ్ అక్తర్ ఆఫ్ఘన్లను చూసి నేర్చుకోవాల్సిన అగత్యం పాక్ జట్టుకు లేదని అన్నాడు. తాము వారిని చూసి నేర్చుకోవాల్సిన స్థాయిలో ఆఫ్ఘన్లు లేరని అన్నాడు. వాస్తవానికి ఆఫ్ఘన్ జట్టులో సగం మంది పాకిస్థాన్ కు చెందినవాళ్లేనని, వాళ్ల ఐడీ కార్డులు తనిఖీ చేస్తే గుట్టురట్టవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్ టీమ్ లో సగానికి పైగా పెషావర్ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని ఆరోపించాడు. ఆఫ్ఘన్లను క్రికెట్ నుంచి బయటికి పంపించాలంటే ఈ ఒక్క ఆధారం చాలని అక్తర్ అన్నాడు.