Koteshwaramma: లక్షలాది మందికి విద్యాదానం చేసిన 'మాంటిస్సోరి' అధినేత్రి కన్నుమూత!
- ఈ ఉదయం కన్నుమూసిన కోటేశ్వరమ్మ
- అనారోగ్యంతో బాధపడుతూ మృతి
- సంతాపం తెలిపిన విద్యావేత్తలు
మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత్రి, లక్షలాది మందికి విద్యాదానం చేసిన కోటేశ్వరమ్మ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. కోటేశ్వరమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మంగళవారం విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. కృష్ణాజిల్లా గోసాల గ్రామంలో 1925 సెప్టెంబరు 15న జన్మించిన ఆమె, బాలికా విద్య కోసం ఎంతో కృషి చేశారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాంటిస్సోరి పాఠశాలలను, ఇంటర్, డిగ్రీ కాలేజీలనూ స్థాపించారు. 1955లో ఆమె పాఠశాలలను స్థాపించగా, ఇప్పటివరకూ లక్షలాది మంది విద్యను అభ్యసించారు. విద్యారంగంలో ఆమె చేసిన సేవలను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గుర్తించింది. 1971లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, నాటి రాష్ట్రపతి వీవీ గిరి చేతులమీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. కోటేశ్వరమ్మ మృతి పట్ల పలువురు విద్యావేత్తలు సంతాపాన్ని వెలిబుచ్చారు.