Dubai: రూ. 270 కోట్లతో పారిపోయిన దుబాయ్ రాజు భార్య!
- బిడ్డలను తీసుకుని లండన్ కు
- ఎవరి కోసం వెళ్లావని ప్రశ్నించిన షేక్ మహమ్మద్
- మోసం చేసిందని ఆరోపణ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (69) భార్య, హయా అల్ హుస్సేన్ (45) ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, రూ. 270 కోట్లతో పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆమె దుబాయ్ నుంచి లండన్ కు ఎస్కేప్ అయింది. ఇటీవలే భర్తతో తెగదెంపులు చేసుకున్న ఆమె, తన ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది. ఈ ఘటనపై షేక్ మహమ్మద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె మోసం చేసిందని ఆరోపించారు. "ఎవరి కోసం నువ్వు లండన్ వెళ్లావ్?" అంటూ తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా మండిపడ్డారు.
కాగా, జర్మనీకి చెందిన ఓ దౌత్యవేత్త సాయంతో హయా లండన్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. తనకు జర్మనీలో ఆశ్రయం కల్పించాలని కూడా ఆమె కోరినట్టు సమాచారం. జోర్డన్ రాజుకు హయా సవతి సోదరి అవుతారు. 2004లో షేక్ మహమ్మద్ తో హయాకు వివాహం జరుగగా, వారికి ఇద్దరు పిల్లలు. విడాకుల తరువాత దుబాయ్ లో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు వచ్చాయి.