Palamaneru: పలమనేరు పరువు హత్యపై భగ్గుమన్న దళిత సంఘాలు.. శాంతింప జేసిన సబ్ కలెక్టర్
- హైమ బిడ్డకు రూ.5 లక్షలు ఇప్పిస్తామని హామీ
- తండ్రి ఆస్తిలో హైమకు వాటా వచ్చేలా చేస్తామన్న కీర్తి
- కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తామని వెల్లడి
చిత్తూరు జిల్లా పలమనేరు పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఊసరపెంట గ్రామానికి చెందిన దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. హతురాలి భర్త కేశవులు కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తగ్గేది లేదని భీష్మించాయి. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ కీర్తి, హైమవతి భర్త కేశవులు, కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు.
కేశవులు, హైమ దంపతుల బిడ్డకు రూ.5 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే భాస్కర నాయుడు ఆస్తిలో హైమకు వాటా వచ్చేలా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో పాటు కేసును ఎస్సీ, ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తామని చెప్పి కీర్తి ఒప్పించడంతో దళిత సంఘాలు శాంతించి ఆందోళన విరమించాయి.
ఊసరపెంట గ్రామానికి చెందిన కేశవులు, హైమ రెండున్నరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి స్వగ్రామానికి దూరంగా జీవిస్తూ వచ్చిన కేశవులు దంపతులు ఈ నెల 22న బిడ్డ జన్మించడంతో సొంతూరుకు వచ్చారు. కూతురు దళితవాడలో ఉండటం పరువు తక్కువగా భావించిన హైమ తండ్రి భాస్కర నాయుడు తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం సాయంత్రం హైమను హతమార్చారు.