PNB: మాల్యా, నీరవ్ మోదీలను మించిపోయిన సందేసరా బ్రదర్స్... రూ.14 వేల కోట్ల కుంభకోణం!
- పీఎన్ బీ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం వెలుగులోకి
- మరోసారి మోసపోయిన బ్యాంకులు!
- కొనసాగుతున్న దర్యాప్తు
భారత్ లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలు, కుంభకోణాలంటే విజయ్ మాల్యా, నీరవ్ మోదీలే స్ఫురణకు వస్తారు. ఇప్పుడు వారిని మించిపోయేలా సందేసరా బ్రదర్స్ భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విస్తుపోయే వాస్తవాలను వెలికితీసింది. గుజరాత్ కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ ప్రమోటర్లుగా నితిన్ సందేసరా, చేతన్ సందేసరా అనేక బ్యాంకులను దాదాపుగా రూ.14,000 కోట్ల మేర మోసం చేశారని ఈడీ పేర్కొంది.
నీరవ్ మోదీ పాల్పడిన పీఎన్ బీ కుంభకోణం రూ.12 వేల కోట్లు కాగా, ఇప్పుడు సందేసరా సోదరులు దాన్ని మించిపోయేలా బ్యాంకులకు టోకరా వేసినట్టు అర్థమవుతోంది. భారత్ లో పలు బ్యాంకుల నుంచి రూ.5393 కోట్ల రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన ఈ ఇద్దరు సోదరులు, విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకుల బ్రాంచీల నుంచి దాదాపు రూ.9 వేల కోట్లు రుణాల రూపంలో తీసుకున్నట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
నితిన్, చేతన్ లపై 2017లోనే ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. కాగా, సందేసరా బ్రదర్స్ కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల్లో ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు, యూకో బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. దర్యాప్తును అనుసరించి ఇప్పటివరకు సందేసరా కుటుంబీకులకు చెందిన రూ.9778 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేశారు.