Andhra Pradesh: చంద్రబాబు, నారా లోకేశ్ అన్నింటికి సిద్ధం కావాలి.. వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ హెచ్చరిక!

  • టీడీపీ నేతలు రౌడీల చేష్టలు చేస్తున్నారు
  • ప్రజలు ఏమనుకుంటారో అని చూడాలి
  • తాడేపల్లిలో మీడియాతో వైసీపీ అధికార ప్రతినిధి

టీడీపీ నేతలు తొడలు కొడుతూ, మీసాలు మెలేస్తూ వీధి రౌడీ చేష్టలు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఇలాంటి పనులు చేసేముందు ప్రజలు ఏమనుకుంటారో అని అలోచించాలని హితవు పలికారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన తప్పులు, అవినీతిపై ఎవరూ మాట్లాడకూదని ఆ పార్టీ నేతలు అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేశ్ తో పాటు టీడీపీకి చెందిన మాజీ మంత్రులంతా ఈరోజున విచారణ అంటే భయపడి చస్తున్నారని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

జైలుకు వెళతామన్న భయంతోనే  సీఎం జగన్ కేబినెట్ కమిటీ వేయగానే టీడీపీ నేతలు గంగవెర్రులు వేస్తున్నారని విమర్శించారు. ‘కాబట్టి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ అన్నింటికి సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచిందని గుర్తుచేశారు.

బీజేపీ నేత పురంధేశ్వరి హోదా ముగిసిన అధ్యాయమని చెప్పడంపై పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వరాదని చెప్పిందంటూ బీజేపీ నేతలు నెపాన్ని నెడుతున్నారనీ, ఇది సరికాదని హితవు పలికారు. హోదా ఇవ్వరాదని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇచ్చేవరకూ అడుగుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు, పురంధేశ్వరి కూడా అడగాలని హితవు పలికారు. ఏపీకి రాజధాని లేదు కాబట్టే ప్రత్యేకహోదాను ఇస్తామని హామీ ఇచ్చారనీ, ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కలిపి ఏపీని చూడొద్దని కేంద్రాన్ని కోరారు. బీజేపీ నేత పురంధేశ్వరి ప్రత్యేక హోదాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోగా, హోదా కోసం పోరాడుతున్నవారిని వెటకారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
amaravati
YSRCP
vasireddy padma
warning
  • Loading...

More Telugu News