Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ను టీడీపీ కుక్కలు చింపిన విస్తరిలా మార్చివేసింది!: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ

  • టీడీపీ అవినీతి పుట్టలు బయటపడుతున్నాయి
  • అవినీతి జరగకుంటే ఎందుకు భయపడుతున్నారు?
  • తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన వైసీపీ అధికార ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసి ఇంకా నెలరోజులు కూడా పూర్తి కాలేదని, అయినా టీడీపీ నేతలు గత ఐదు రోజులుగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో సీఎం జగన్ జరుపుతున్న సమీక్షా సమావేశాల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి పుట్టలు బట్టబయలు అవుతున్నాయని వ్యాఖ్యానించారు. దీన్ని చూసి సీఎం జగన్ కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, మట్టి-ఇసుకకు సంబంధించి టీడీపీ నేతలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఓ 30 అంశాలపై జగన్ కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అవినీతి జరగకుంటే ఆ పార్టీ నేతలు ఎందుకు కలవరపడుతున్నారని నిలదీశారు.

గతంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈరోజున విద్యుత్ శాఖ రూ.18,000 కోట్ల మేర విద్యుత్ కంపెనీలకు బకాయిలు పడిందనీ, టీడీపీ సర్కారు ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను, ఏపీలోని అన్ని వ్యవస్థలను టీడీపీ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరిగా మార్చేసిందని ఆరోపించారు.  తమ అక్రమాలను చూసి కూడా కళ్లు మూసుకునిపోవాలని టీడీపీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజావేదిక వ్యవహారంలో టీడీపీ నేతల రాద్ధాంతం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
vasi reddy
Chandrababu
Jagan
Chief Minister
  • Loading...

More Telugu News