Narendra Modi: కేంద్ర ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ లేఖ.. తన సిబ్బందిని కుదించడంపై ఆగ్రహం!
- నా ఆఫీసు సిబ్బందిని 14 నుంచి ఐదుకు తగ్గించారు
- వాజ్ పేయి విషయంలో మేం ఇలా ప్రవర్తించలేదు
- వెంటనే నా కార్యాలయ వ్యక్తిగత సిబ్బందిని పెంచండి
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు. తనకు కేటాయించిన వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది సంఖ్యను తగ్గించవద్దని కోరారు. ప్రధానిగా ఉన్నప్పుడు తన కార్యాలయంలో 14 మంది సిబ్బంది పనిచేసేవారనీ, ఆ సంఖ్యను ఐదుకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని వాపోయారు.
బీజేపీ వ్యవస్థాపకుడు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో 12 మంది సిబ్బంది ఉండేవారని మన్మోహన్ సింగ్ గుర్తుచేశారు. ప్రధానిగా తప్పుకున్నాక కూడా వాజ్ పేయి విజ్ఞప్తి చేయడంతో అదే 12 మంది సిబ్బందిని తాము కొనసాగించామని గుర్తుచేశారు. ఇదే సూత్రాన్ని అనుసరించి తన కార్యాలయంలో 14 మంది సిబ్బందిని పెంచాలని కోరారు. ఇప్పటికే తాను ఓసారి లేఖ రాసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మన్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.