Virat Kohli: ధోనీ గురించి ప్రతి ఒక్కరూ నోరు పారేసుకుంటున్నారు... లక్ష్మణ్, సెహ్వాగ్ లపై కోహ్లీ అసహనం!

  • ధోనీకి మద్దతుగా నిలుస్తాను
  • ఒకరోజు కలిసిరాకుంటేనే విమర్శలా
  • క్లిష్ట పరిస్థితుల్లోనూ పరుగులు సాధించే ధోనీ
  • మీడియా సమావేశంలో కోహ్లీ

ఈ వరల్డ్ కప్ లో ఎంఎస్ ధోనీ ఆటతీరు నిదానంగా సాగుతోందని వస్తున్న విమర్శలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఎప్పుడు, ఎక్కడ ఎలా ఆడాలో ధోనీకి బాగా తెలుసునని వ్యాఖ్యానించిన కోహ్లీ, ప్రతి ఒక్కరికీ కొన్ని చెడు రోజులు ఉంటాయని, ఒక రోజు కలిసిరానంత మాత్రాన ప్రతి ఒక్కరూ విమర్శించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిన్నటి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ, ధోని ఆటతీరును కొనియాడాడు.  ధోనీ ఆడకపోతే ప్రతి ఒక్కరూ నోరు పారేసుకుంటారని, కానీ తాము మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తామని చెప్పాడు.

ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, కావాల్సిన పరుగులను ధోని సాధిస్తాడని, పిచ్‌ ను అంచనా వేసే విషయంలో అతనికి సాటి మరొకరు లేరని అన్నాడు. తను ఇలానే ఉండాలని, తదుపరి మ్యాచ్ లలోనూ రాణించాలని కోరుకుంటున్నానని అన్నాడు. తాను కూడా 70 శాతం పరుగులను సింగిల్స్ ద్వారానే తీశానని, ఈ పిచ్ లపై పరుగులు రావాలంటే, అదే ఉత్తమమని అన్నాడు.

కాగా, ధోనీ నిదానంగా ఆడటంపై వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి వారు విమర్శించిన సంగతి తెలిసిందే. ఎవరి పేర్లనూ కోహ్లీ ప్రస్తావించనప్పటికీ, వీరిని ఉద్దేశించే మాట్లాడాడని క్రీడా పండితులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News