Ration card: ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు!
- దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునేలా రేషన్ కార్డు రూపకల్పన
- వలసదారులకు వరంగా మారనున్న విధానం
- తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న వైనం
‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్ర ఆహార శాఖామంత్రి రాంవిలాస్ పాశ్వాన్ గురువారం రాష్ట్రాల కార్యదర్శులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ ఆహార భద్రత చట్టం సహా పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇకపై దేశంలో ఎవరైనా, ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ఇందుకోసం దేశంలో ఎక్కడైనా పనిచేసేలా రేషన్‌కార్డుల విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ విధానం వలసదారులకు వరంగా మారుతుందన్నారు.
నిజానికీ ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతోంది. రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానం అమలుకు నడుం బిగించాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ దిశగా అడుగులు వేస్తోంది.