Shami: షమీ విజృంభణకు గేల్ బలి
- తొలి స్పెల్ లో 2 వికెట్లు తీసిన షమీ
- 16 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకున్న విండీస్
- 8 ఓవర్లలో విండీస్ స్కోరు 2 వికెట్లకు 21 రన్స్
గత మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అదే ఊపు కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్ తో మాంచెస్టర్ లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో షమీ కొత్తబంతితో నిప్పులు చెరగడమే కాదు, స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ సహా మరో కీలక ఆటగాడు షై హోప్ ను కూడా పెవిలియన్ దారిపట్టించాడు. షమీ బంతులకు విండీస్ ఆటగాళ్ల వద్ద జవాబే లేకుండాపోయింది. 19 బంతులాడి 6 పరుగులు చేసిన గేల్ సహజశైలిలో ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. చివరికి షమీ బౌలింగ్ లో జాదవ్ కు దొరికిపోయాడు.
ఇక హోప్ విషయానికొస్తే, షమీ విసిరిన బంతి అతడ్ని విస్మయానికి గురిచేసింది. ఆ బంతికి హోప్ బౌల్డ్ కాగా, ఎలా బౌల్డయానన్న విషయం అతడికి త్వరగా బోధపడలేదు. దాదాపు సంభ్రమ స్థితిలోనే మైదానం వీడాడు. ప్రస్తుతం వెస్టిండీస్ స్కోరు 8 ఓవర్లలో 2 వికెట్లకు 21 పరుగులు. ఆ జట్టు గెలవాలంటే 42 ఓవర్లలో 248 పరుగులు చేయాలి. అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.