Andhra Pradesh: అప్పట్లో వైఎస్ ప్రజల్లో పరువు పోగొట్టుకున్నారు.. ఇప్పుడు జగన్ కూడా అంతే!: దేవినేని అవినాశ్
- వైఎస్ బాబుపై 22 సబ్ కమిటీలు వేశారు
- అయినా ఏ ఆరోపణనూ నిరూపించలేకపోయారు
- జగన్ కు కూడా అలాగే అపహాస్యం తప్పదు
టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులో అవినీతిని వెలికితీయడానికి సీఎం జగన్ నిన్న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తమపై కక్షసాధింపు చర్యల కోసం, బురద చల్లడానికే జగన్ సర్కారు ఉపసంఘాన్ని నియమించిందని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేత దేవినేని అవినాశ్ స్పందించారు.
2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై 22 సబ్ కమిటీలు వేశారని అవినాశ్ గుర్తుచేశారు. కానీ ఏ ఆరోపణ కూడా నిరూపించలేకపోయిన వైఎస్ పరువు పోగొట్టుకుని వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా వైఎస్ తరహాలో అపహాస్యం తప్పదని జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాశ్ వైసీపీ నేత కొడాలి నాని చేతిలో ఓటమి చవిచూశారు.