Andhra Pradesh: టీడీపీ నేత మురళీమోహన్ కు షాక్.. విశాఖలో ‘జయభేరీ షోరూమ్’ ను కూల్చేసిన అధికారులు!
- గంటా, పీలా గోవింద్ అక్రమ కట్టడాలు గుర్తింపు
- వాటిని కూడా కూల్చేయనున్న అధికారులు
- అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం
అక్రమ కట్టడాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నగరపాలక అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. నగరంలోని జోన్-2 పరిధిలో ఎంవీపీ సెక్టార్-11లో టీడీపీ నేత మురళీ మోహన్ ఎలాంటి ప్లాన్ లేకుండా నిర్మించిన జయభేరి ట్రూ వ్యాల్యూ కార్ షోరూమ్ ను కూల్చివేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా 1000 గజాల స్థలంలో ఈ షోరూమ్ ను నిర్వహిస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ జి.సృజన ఆదేశాలతో దాన్ని తొలగించారు.
అలాగే జోన్-1 పరిధిలోని భీమిలిలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన క్యాంపు కార్యాలయాన్ని కూడా అనుమతి, ప్లానింగ్ లేకుండా అక్రమంగా నిర్మించారని అధికారులు గుర్తించారు. దీంతో పాటు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు చెందిన భవనం ప్లానింగ్ కు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ రెండు బిల్డింగులను మరికాసేపట్లో అధికారులు కూల్చేయనున్నారు.