Mizoram: తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకొని భారత్‌కు విజయం అందించిన మహిళా హాకీ ప్లేయర్
- ఆదివారం ఫైనల్ మ్యాచ్
- శుక్రవారం గుండెపోటుతో తండ్రి మృతి
- గ్రామానికి చేరుకున్న వేళ బోరుమన్న గ్రామస్థులు
తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుని ఎఫ్ఐహెచ్ విమెన్స్ సిరీస్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన టీమిండియా హాకీ ప్లేయర్ స్వగ్రామానికి చేరుకుంది. తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోయిన ఆమెను చూసీ చూడగానే గ్రామస్థులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మిజోరంలోని కొలాసిబ్ జిల్లాకు చెందిన లాల్‌రెమ్సియామి భారత మహిళల హాకీ జట్టులో ఫార్వార్డ్ ప్లేయర్.
జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన ఎఫ్ఐహెచ్ విమెన్స్ సిరీస్‌లో పాల్గొంటున్న భారత జట్టులో ఆమె సభ్యురాలు. శుక్రవారం ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. అయితే, జట్టులో కీలక సభ్యురాలు కావడం, ఆదివారం ఫైనల్స్ ఉండడంతో ఆమె గుండె దిటవు చేసుకుని అక్కడే ఉండిపోయారు. ఫైనల్స్‌లో జట్టుకు విజయాన్ని అందించారు. మంగళవారం ఆమె స్వగ్రామం చేరుకున్నారు. లాల్‌రెమ్సియామిని చూడగానే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెను పొదివి పట్టుకుని రోదించారు. తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. దీంతో కాసేపు ఉద్విగ్నభరిత వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం లాల్‌రెమ్సియామి మాట్లాడుతూ.. తన తండ్రి ఎక్కడున్నా తన విజయాలకు గర్వపడుతుంటారని కన్నీళ్లు పెట్టుకుంది.