Jagan: అమరావతికి భూములిచ్చేందుకు ఇష్టపడని రైతుల నుంచి తీసుకోవడం అవసరమా?: జగన్ కీలక వ్యాఖ్య
- బలవంతంగా భూములిచ్చామని గతంలో రైతుల ఫిర్యాదు
- సీఆర్డీయే సమీక్షలో గుర్తు చేసుకున్న జగన్
- కేవలం ముగ్గురు అధికారులకే సమీక్షలో పాల్గొనేందుకు అనుమతి
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతుల నుంచి భూములు తీసుకోవడం అవసరమా? అని సీఎం వైఎస్ జగన్ అధికారులను ప్రశ్నించారు. ముఖ్యంగా ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు తదితర గ్రామాల్లోని ప్రజలు, తాము అధికారుల బలవంతం మీదనే భూములిచ్చామని గతంలో తనకు చెప్పారని అధికారులతో సీఆర్డీయే సమీక్షలో వ్యాఖ్యానించిన జగన్, ఏ అవసరాల కోసం ఆ భూముల్ని తీసుకోవాలనుకుంటున్నారు? అని అడిగారు.
అమరావతి నిర్మాణంపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. కేవలం ముగ్గురు ఉన్నతాధికారులు మాత్రమే సమీక్షకు హాజరు కాగా, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకూ అమరావతిలో జరిగిన పనులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జగన్ కు అధికారులు తెలిపారు. భూ సమీకరణలో ఎంత భూమిని తీసుకున్నారు? రైతులు ఎంతమంది భూములిచ్చారు? వారికి కేటాయించిన ప్లాట్లు ఎన్ని?, మొదలు పెట్టిన పనుల్లో 25 శాతం దాటినవి ఎన్ని? తదితర అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.