Russia: ఎలుగుబంటి గుహలో నిలువెల్లా గాయాలతో 'మమ్మీ'లా మనిషి.. ఆశ్చర్యపరుస్తున్న అతని కథనం!
- రష్యాలో విచిత్రఘటన
- ఎలుగుబంటి దాడికి గురై ఈజిప్టు మమ్మీలా గోచరించిన బాధితుడు
- వేటకుక్కలు పసిగట్టడంతో ప్రాణాలు దక్కిన వైనం
రష్యాలో టువా అనేది ఓ మారుమూల ప్రాంతం. అక్కడంతా పర్వతాలు, అడవులమయం కావడంతో క్రూరమృగాలకు కొదవలేదు. ఇటీవల టువా ప్రాంతంలో ఓ విచిత్రం జరిగింది. కొందరు వేటగాళ్లు తమ కుక్కలతో అటవీప్రాంతంలో వేటాడుతుండగా అనుకోని దృశ్యం కంటబడింది. ఓ గుహ వద్ద ఆగిపోయిన వేటకుక్కలు ముందుకు కదలడానికి మొరాయించాయి. అదే పనిగా అరుస్తుండడంతో వేటగాళ్లు ఆ గుహలో ఏముందో పరిశీలించి దిగ్భ్రాంతికి గురయ్యారు.
అదొక ఎలుగుబంటి స్థావరంగా గుర్తించిన వాళ్లకు, అందులో దాదాపు ఈజిప్టు మమ్మీలా చిక్కిశల్యమైన స్థితిలో ఓ వ్యక్తి కనిపించాడు. ఒంటినిండా గాయాలతో ఉన్న అతడు చనిపోయి ఉంటాడని భావించిన వేటగాళ్లకు అతనిలో కదలిక కనిపించడంతో మరింత విస్మయానికి లోనయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తన పేరు అలెగ్జాండర్ అని మాత్రమే చెప్పగలిగిన ఆ వ్యక్తి అక్కడి డాక్టర్లకు అసలు విషయం చెప్పాడు.
తనపై ఎలుగుబంటి దాడి చేసి వెన్నెముక విరిగిపోయేలా గాయపర్చిందని, ఆపై తనను ఓ మూలకు విసిరేసిందని వివరించాడు. అది ఎందుకు అలా చేసిందో ఆ తర్వాత అర్థమైందని, తనను భవిష్యత్తులో తినడానికి పనికొచ్చే ఆహారంగా భావించి భద్రపరిచినట్టు తెలుసుకున్నానని చెప్పాడు. బతకడానికి స్వీయ మూత్రపానం చేశానని అలెగ్జాండర్ వెల్లడించాడు.
స్థానికంగా అందరూ టువన్ భాష మాట్లాడతారు. కానీ అలెగ్జాండర్ మాత్రం రష్యన్ లో మాట్లాడుతుండడంతో అతను ఆ ప్రాంతానికి చెందినవాడు కాదని నిర్ధారించుకున్నారు. అలెగ్జాండర్ శరీరంపై ఉన్న గాయాలు చూసిన వైద్యులకు మతిపోయింది. అన్ని గాయాలతో ఓ మనిషి బతకడం నిజంగా అద్భుతం అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రష్యాలో కనిపించే గోధుమవర్ణ ఎలుగుబంట్లు వేటాడిన తర్వాత ఆహారాన్ని పూర్తిగా తినకుండా భద్రపరుచుకుంటాయి. అలెగ్జాండర్ ను కూడా ఆ ఎలుగు చంపి తినకుండా గుహలో ఉంచింది.