Andhra Pradesh: అమరావతిలో ఒక్క ఇటుకా పడలేదన్నావ్.. మరిప్పుడు ఎక్కడి నుంచి పాలన చేస్తున్నావ్ జగన్?: దేవినేని ఉమ

  • టైం నాయనా.. జగన్.. టైం చాలా బలీయమైనది
  • ఉడుత ఊపులకు, పోలీస్ కర్రల ఊపులకు మేం భయపడం
  • ఈరోజు నువ్వు పైశాచిక ఆనందం పొందుతున్నావ్
  • అమరావతిలో మీడియాతో మాజీ మంత్రి

అమరావతిలోని ప్రజావేదికను పగలగొట్టడం ద్వారా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఇలాంటి వాటికి తాము భయపడబోమనీ, అన్ని త్యాగాలకు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఉడుత ఊపులకు, పోలీస్ కేసులకు, కర్ర ఊపుడుకు తాము భయపడబోమనీ, ప్రజల కోసం పోరాడుతామనీ, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును కట్టిందనీ, గుంటూరు జిల్లాకు రూ.44,000 కోట్లు తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.

‘టైం నాయనా.. జగన్ మోహన్ రెడ్డి.. టైం. కాలం చాలా బలీయమైనది. ప్రతీఒక్కరికీ ఒకరోజు వస్తుంది. కాలం చాలా క్రూరమైనది. కాలం శక్తిమంతమైనది. ఎస్.. ఈ కాలం మనది అనుకుని పనిచేస్తే మనది అవుతుంది. ఇవాళ రాజధాని లేనప్పుడు.. కట్టుబట్టలతో ఇక్కడకు వచ్చాం. రూ.16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఉన్నప్పుడు చెట్టు కింద బస్సు పెట్టుకుని పరిపాలన చేశాం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు కూర్చునే కుర్చీ చాలామంది త్యాగాలు చేశారు ఇక్కడ. 34,000 మంది రైతుల త్యాగాలు ఉన్నాయి ఇక్కడ.

ఈరోజు నువ్వు పైశాచిక ఆనందం పడుతున్నావ్. పడు. ఓ చిన్న సీఈ ఆఫీసులో మంత్రిగా నేను కూర్చున్నా. సీఎం చిన్న బస్సులో ఉంటూ ఇరిగేషన్ కార్యాలయం కేంద్రంగా పాలన సాగించారు. ఇదే కార్యాలయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేశారు. నీలాగా ఒక రాజభవనం కట్టుకోవాలని చంద్రబాబు ఏనాడూ కలలు కనలేదు. చిన్న ఇంట్లో ఉంటున్నారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధాని చేయాలని తాపత్రయ పడ్డారు. అమరావతిలో ఇటుక కూడా పడలేదని చెప్పావ్. మరి ఇప్పుడు ఎక్కడ కూర్చుని పాలన చేస్తున్నావ్ జగన్ మోహన్ రెడ్డి?’ అని విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News