Erramanjil: అక్కడ తెలంగాణ నూతన అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ఆపండి.. హైకోర్టులో పిటిషన్
- ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విద్యార్థి
- శుక్రవారం విచారణ చేపట్టనున్న హైకోర్టు
- శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
తెలంగాణాకు నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం హైదరాబాద్, ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాలను కూల్చి వేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. చారిత్రక భవనాల కూల్చివేత వ్యవహారంపై పీహెచ్‌డీ విద్యార్థి శంకర్ నిన్న హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. అలాగే సుమారు 150 ఏళ్లనాటి భవనాలను కూల్చివేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ సామాజిక కార్యకర్త సార్వత్ కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ రెండు వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. త్వరలో నూతన అసెంబ్లీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో నేడు విచారణ నిర్వహించాలని శంకర్ తరుపు న్యాయవాది సత్యంరెడ్డి కోర్టును కోరారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.