YS Viveka: వివేకా హత్యకేసులో సరైన ఆధారాలు చెప్పగలిగితే ఊహించని రివార్డు: పులివెందుల డీఎస్పీ ప్రకటన
- వివేకా హత్యకేసుపై డీఎస్పీ మీడియా సమావేశం
- వివరాలు తెలిస్తే చెప్పాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
- ఆధారాలు అందించేవారి సమాచారం గోప్యంగా ఉంచుతామంటూ హామీ
పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు నిందితులు ఎవరన్నది స్పష్టంగా తెలియలేదు. దీనిపై పోలీసు శాఖ వద్ద కూడా సరైన సమాచారం లేదన్న విషయం తాజాగా పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ చేసిన ప్రకటనను బట్టి అర్థమవుతోంది.
స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వాసుదేవన్ మాట్లాడుతూ, వివేకా హత్య కేసు తమకు పెను సవాలుగా మారిందన్నారు. సిట్ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసిందని, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 23 మంది ఎస్ఐలు ఈ కేసు దర్యాప్తులో పాలుపంచుకుంటున్నారని వివరించారు. ఈ కేసులో ప్రజలకు గానీ, పోలీసు సిబ్బందికి కానీ ఎలాంటి సమాచారం తెలిసినా తమతో పంచుకోవాలని, సరైన ఆధారాలతో సమాచారం అందించినవారికి ఊహించని నజరానా ఉంటుందని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన కీలక వివరాలు చెప్పినవాళ్ల సమాచారం రహస్యంగా ఉంచుతామని డీఎస్పీ భరోసా ఇచ్చారు.