Mehul Chowksi: మోదీ సర్కారు విజయం... పీఎన్బీ స్కామ్ నిందితుడు మేహుల్ చోక్సీని అప్పగించేందుకు అంటిగ్వా అంగీకారం!

  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను ముంచేసిన నీరవ్, మేహుల్
  • ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసిన అంటిగ్వా ప్రధాని
  • రెండు వారాల్లో ఇండియాకు తెచ్చే అవకాశం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను దాదాపు రూ. 13,500 కోట్లకు ముంచేసిన స్కామ్ లో ప్రధాన నిందితుల్లో ఒకరైన మేహుల్ చోక్సీని ఇండియాకు అప్పగించేందుకు అంటిగ్వా అంగీకరించింది. ఈ కేసులో తొలి నిందితుడు నీరవ్ మోదీ అన్న సంగతి తెలిసిందే. నీరవ్ అప్పగింత దిశగా, లండన్ కోర్టులో సీబీఐ, ఈడీ తమ వాదనలు వినిపిస్తున్న వేళ, మేహుల్ ని అప్పగించే మార్గాన్ని సుగమం చేస్తూ, ఆయన పాస్ పోర్ట్ ను, తామిచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు అంటిగ్వా ప్రధాని నేడు ప్రకటించారు. మరో రెండు వారాల్లోనే చోక్సీని అదుపులోకి తీసుకుని ఇండియాకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు ఇండియాలోని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోవడంపై ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వారిని తిరిగి ఇండియాకు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నా, అవి అంత త్వరగా కార్యరూపం దాల్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు మేహుల్ ని రప్పించేందుకు మార్గం సుగమం కావడంతో బీజేపీ నేతలు, ఇది ప్రధాని మోదీ విజయమని అంటున్నారు.

ఇదిలావుండగా, గత సంవత్సరం అంటిగ్వాకు వెళ్లిన మేహుల్, ఆ దేశ పౌరసత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఆపై తనకు ఆరోగ్యం బాగాలేదని, అందువల్లే ఇండియాకు రాలేకపోతున్నానని సాకులు చెబుతూ వచ్చాడు. ఇప్పుడిక దౌత్య మార్గాల ద్వారా అంటిగ్వాపై ఒత్తిడి తెచ్చిన భారత్, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసేలా ప్రయత్నించి విజయం సాధించింది.

Mehul Chowksi
Narendra Modi
Punjab National Bank
Antigua
  • Loading...

More Telugu News