Kazakhstan: కజకిస్థాన్ ఆర్మీ ఆయుధ డిపోలో భారీ పేలుళ్లు.. పలువురికి గాయాలు
- ఆయుధ డిపోలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- పెద్ద శబ్దంతో పేలిన ఆయుధాలు
- ముగ్గురి పరిస్థితి విషమం
ఆర్మీ ఆయుధ డిపోలో సోమవారం చోటుచేసుకున్న వరుస పేలుళ్లతో కజకిస్థాన్ వణికిపోయింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడగా, 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర కజక్‌లోని ఆర్మీ ఆయుధ డిపోలో సోమవారం ఈ పేలుళ్లు సంభవించినట్టు అధికారులు తెలిపారు. డిపోలో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో అందులోని ఆయుధాలు పెద్ద శబ్దంతో పేలిపోయినట్టు కజకిస్థాన్ రక్షణ శాఖ పేర్కొంది. పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.
భారీ పేలుడు సంభవించినప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన 50 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, తీవ్రంగా గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయుధ డిపోలో మంటలు ఎలా చెలరేగాయన్నది తెలియరాలేదు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.