Andhra Pradesh: కడవరకూ టీడీపీలోనే ఉంటా.. క్లారిటీ ఇచ్చిన యరపతినేని!
- కార్యకర్తలను హింసిస్తే కోర్టులకు ఈడుస్తాం
- పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే
- వైసీపీ అరాచకాలకు అంతులేకుండా పోయిందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి నేపథ్యంలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పార్టీని వీడుతారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా గుంటూరు జిల్లా మాచవరంలో టీడీపీ శ్రేణులతో సమావేశమైన యరపతినేని ఈ వార్తలను ఖండించారు. గురజాలలో టీడీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలనీ, తాను అందరికీ అండగా ఉంటానని యరపతినేని తెలిపారు. టీడీపీ పాలనలో పల్నాడులో ప్రజలు ప్రశాంతంగా బతికారనీ, కానీ ఇప్పుడు వైసీపీ నేతల ఆగడాలు, అరాచకాలకు అంతేలేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తురకపాలెం, మోర్జంపాడు, జూలకల్లు, పిన్నెల్లి, తుమ్మలచెరువు తదితర గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని విరమ్శించారు.
ప్రభుత్వాలు మారుతూఉంటాయనీ, పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెడితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపేలా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. తాను టీడీపీలోనే పుట్టాననీ, కడవరకూ టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఓ గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగితే మిగతా ఊర్లలోని టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని సూచించారు. ఈ భేటీకి భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.